Saturday, January 8, 2011

మద్దెలచెరువు సూరి హత్య పధకం ప్రకారమే...!!

 మద్దెలచెర్వు సూరీ హత్యకేసులో ప్రధాన నిందితుడు భాను ఒక పథకం ప్రకారం వ్యవహరించి ఎస్కేప్‌ అయినట్లు పోలీసులు గుర్తించారు. అతను అప్పటికప్పుడు డెసిషన్‌ తీసుకుని సూరీని మర్డర్‌ చేయలేదని.. పక్కా స్కెచ్‌ రూపొందించుకుని, దాని ప్రకారమే ఈ హత్యకు పాల్పడినట్లు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. సూరీ హత్యకు నెల రోజుల ముందు నుంచే భాను ప్లాన్‌ ఇంప్లిమెంటేషన్‌ ప్రారంభించినట్లు తెలుస్తోంది. మద్దెల చెరువు సూరీ హత్యకు అతని ప్రధాన అనుచరుడు భాను సుదీర్ఘ కసరత్తు చేసినట్లు దర్యాప్తు సంస్థల విచారణలో తేలింది.
అంతా అనుకుంటున్నట్లు సూరీకి, భానుకు ఉన్న పరిచయం ఏడేళ్లది కాదని, పదేళ్ల క్రితం నుంచే వీరి మధ్య సక్యత ఉందని పోలీసులు గుర్తించారు. ముందునుంచీ నేరచరిత ఉన్న భానుకిరణ్‌ గతంలో అక్రమ ఆయుధాల వ్యాపారం చేసేవాడు. 2002లో హైదరాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ఇతన్ని అక్రమ ఆయుధాల విక్రయాల కేసులో అరెస్టు చేసి, మూడు ఫైర్‌ ఆర్మ్స్‌ స్వాధీనం చేసుకున్నారు. 2006లో సైదాబాద్‌లో ఓ ప్రాపర్టీ ఇష్యూలో, 2009లో బేగంపేట్‌లో ఆయుధాల కేసులో ఇతను అరెస్టయ్యాడు.
ఇవే కాకుండా బెంగళూరులోనూ ఇతనిపై ఆర్మ్స్‌ యాక్ట్‌ కింద కేసులున్నాయి. ముందు నుంచి ఇతనికి అక్రమ ఆయుధాలతో అవినాభావ సంబంధం ఉందనడానికి ఈ కేసులే నిదర్శనం. అలా సంపాదించిన కంట్రీమేడ్‌ ఫైర్‌ఆర్మ్స్‌తోనే భాను ఈ హత్య చేసి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. సూరీ హత్యకు సుదీర్ఘ కసరత్తు చేసిన భానుకిరణ్‌ ఏ ఒక్క ఆధారాన్ని వదలకుండా జాగ్రత్తపడ్డాడు. ముందు నుంచీ నేరచరిత్రతో జైలు జీవితం గడిపిన భాను వివాహం చేసుకోలేదు. అతనికి హెడ్‌మాస్టర్‌గా రిటైర్‌ అయిన ఒక తల్లి, ఒక సోదరుడు, ఒక సోదరి ఉన్నారు.
తల్లి బెంగళూరులో ఉండే సోదరుడి వద్ద ఉంటుండగా... సోదరి ఇరవై రోజుల క్రితం వరకు హైదరాబాద్‌లోనే ఉండేది. ముందే హత్యకు ప్లాన్‌ వేసిన భాను తన సోదరి కుటుంబాన్ని హైదరాబాద్‌ నుంచి షిఫ్ట్‌చేశాడు. సూరీ కొండాపూర్‌కు షిఫ్ట్‌ అయిన తర్వాత భాను కొండాపూర్‌ వైట్‌ఫీల్డ్స్‌లోని వసంత్‌ విహార్‌లోని ఓ సర్వీస్‌ అపార్ట్‌మెంట్‌లో ఉండేవాడు. సూరీ హత్యకు ముందే భాను అక్కడ దుకాణం లేపేసినట్లు సీసీఎస్‌ పోలీసులు గుర్తించారు.
అతను ఉన్న ఫ్లాట్‌లో భానుకు సంబంధించిన ఏ ఒక్క ఆధారాన్నీ విడిచిపెట్టకుండా హత్యకు ముందే వాటిని తరలించాడు. ఇక భానుకు మన్మోహన్‌ సింగ్‌ అనే గన్‌మెన్‌ ఉన్నా... తనకు థ్రెట్‌ ఉంటుందంటూ ఆయుధ లైసెన్స్‌ తీసుకున్నాడు. ఒక సాఫెస్టిగేటెడ్‌ పిస్టల్‌నూ కొనుగోలు చేశాడు. అయితే సూరీ హత్యకు సరిగ్గా నాలుగు రోజుల ముందు... అంటే డిసెంబరు 30 నాడు దాన్ని ఆబిడ్స్‌లోని ఏపీ ఆర్మురీ ఆయుధాల దుకాణంలో డిపాజిట్‌ చేశాడు.
అంటే ముందుగా వేసిన ప్రణాళిక మేరకు ఎక్కడా తాను దోషిని అనే విషయం బయట పడకూడదని ఈ జాగ్రత్తలు తీసుకున్నట్లు పోలీసులు విశ్లేషిస్తున్నారు. పక్కా వ్యూహం, ప్రణాళిక ప్రకారం సూరీ సీక్రెట్‌ మీటింగ్‌కు వెళ్లిన సందర్భంలో అతని వెంట ఎవరూ ఉండరని తెలిసీ, సూరీని అంతమొందించినట్లు దర్యాప్తు సంస్థలు భావిస్తున్నాయి.
చివరకు సూరీ హత్య తర్వాత ఎస్కేప్‌ అయ్యేందుకూ ముగ్గురు నుంచి నలుగురిని ఎంచుకుని ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. తాను పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు భాను సెల్‌ఫోన్‌ స్విచ్‌ఆఫ్‌ చేశాడు. దీంతో తన ఉనికి పోలీసులకు తెలిసే అవకాశమే లేదు. ఇది కూడా భాను స్కెచ్‌లో భాగమేనని పోలీసులు భావిస్తున్నారు.
భానును అరెస్టు చేసేందుకు టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ప్రత్యేక బృందాలుగా పనిచేస్తుండగా... సీసీఎస్‌ పోలీసులు సూరీ హత్యవెనక ఉన్న ప్రధాన కారణాలను విశ్లేషిస్తున్నారు. ఇప్పటికే పలువురిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ప్రధానంగా సూరీ తన ఆస్తులకు బినామీగా భానును పెట్టాడు. ఆ ఆస్తులను తిరిగి తీసుకునే ప్రయత్నంలో సూరీ ఉండడం, పలు సెటిల్మెంట్ల విషయంలో భానును నియంత్రించడం, సూరీ మద్యం మత్తులో ఉన్నప్పుడు భానును దూషించడం, భాను బెజవాడతోపాటు పలు సెటిల్మెంట్లు, అమ్మాయిల బిజినెస్‌లలో సూరీపేరును వినియోగించడంపై వీరి మధ్య విభేదాలు నెలకొన్నాయి.
సూరీ కుక్‌ ప్రసాద్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించిన పోలీసులు హత్య జరిగిన రోజు అతను విధులకు హాజరు కాలేదని, భాను అతన్ని రెండ్రోజులు రావద్దని చెప్పడానే విషయాన్ని గుర్తించారు. ఇక్కడా భాను పక్కాగా తన ప్లాన్‌ ప్రకారం ఇదంతా చేసి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ఇక సూరీ వ్యక్తిగత ల్యాప్‌టాప్‌తో పాటు, అతని ఇంట్లోని మూడు సెల్‌ఫోన్లను సీజ్‌ చేసిన అధికారులు వాటిని ఫోరెన్సిక్‌ సైన్స్‌ లాబ్‌కు తరలించారు. ఫోరెన్సిక్‌ అధికారులు ల్యాప్‌టాప్‌లోని బ్యాకప్‌, రిమూవ్‌ అయిన డేటాను విశ్లేషిస్తున్నారు. లాప్‌టాప్‌ విశ్లేషణ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా సూరీ సెటిల్మెంట్లు జరిపిన విషయాన్ని పోలీసులు గుర్తించారు.

No comments:

Post a Comment